విజేతలెవరూ జీవితం నుంచి పారిపోరు. ఓటమిని ఓ పట్టాన అంగీకరించరు.
ఫ్రెంచి విప్లవంపై తాను అద్భుతంగా రూపొందించిన రాతప్రతి తన కంటి ఎదుటే అగ్నికి ఆహుతి కావడంతో థామస్ కార్లయిల్ అనే గొప్ప రచయిత దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
మానసికంగా కుంగిపోయాడు. పిచ్చివాడిలా తిరుగుతుంటే ఒక రోజు ఇటుక ఇటుకగా శ్రద్ధగా గోడను నిర్మిస్తున్న తాపీ మేస్త్రీ కనిపించాడు. ఏదో మెరుపు మెరిసినట్లు కార్లయిల్‌లో ఆశావాదం మొలకెత్తింది. తాపీ మేస్త్రీ పనితీరు స్ఫూర్తిగా రోజుకో పేజీ రాయాలన్న ఆలోచన తోచింది. తిరిగి రచన మొదలుపెట్టాడు. అది మొదటిదానికన్నా అద్భుతంగా రూపొందడం చూసి తానే ఆశ్చర్యపోయాడు. రెట్టించిన ఉత్సాహంతో ఆ బృహత్తర గ్రంథాన్ని పూర్తిచేశాడు. ‘వీరులు, వీరపూజ (హీరోస్ అండ్ హీరో వర్షిప్)’ పేరుతో విడుదలైన ఆ పుస్తకం ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. కార్లయిల్‌కు అంతులేని కీర్తిని తెచ్చిపెట్టింది.
విజేతలెవరూ జీవితం నుంచి పారిపోరు. ఓటమిని ఓ పట్టాన అంగీకరించరు.
మాట్లాడటం సరిగ్గా రాదని బాల్యంలో హేళనకు గురైన విన్‌స్టన్ చర్చిల్ పట్టుదలతో ప్రసంగ కళను సాధన చేశాడు. ప్రపంచం చెవులొగ్గి వినే గొప్ప వక్తగా పేరు గడించాడు.
పొట్టివాడివి, సినిమాలకు పనికిరావు పొమ్మని చార్లీ చ్లాపిన్‌ను తొలుత కొందరు నటుడిగా అంగీకరించలేదు. కానీ, అచిరకాలంలో చాప్లిన్ నటనకు పాఠ్యగ్రంథంగా రూపొందాడు.
విజేతలందరూ నమ్ముకొనేది ఆశావాదాన్నే. ఆశావాదాన్ని ఆశ్రయిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఆశావాదం ఎల్లవేళలా గెలుస్తుంది. మనిషిని గెలిపిస్తుంది. బతుకు మీద రుచిని పెంపొందిస్తుంది.
ఆశే చీకట్లో చిరుదివ్వై దారి చూపుతుంది.
ముళ్ళ పోదల మధ్య వున్న మొగలిరేకులు తమ పరిమళ గుణాన్ని వదలవు.
అలాగే నువు కూడా నీ ధైర్యాన్ని నమ్మకాన్ని వదలకూడదు. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో రేపటి నీ విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరన్నది సత్యం.
మన నమ్మకమే మనలను గెలిపిస్తుంది, విజేతగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది.


Comments
Post a Comment