ఒక పుస్తకమిచ్చిన మనోవికాసం
ఒక సారి నా మిత్రుడు పోలక్ ఒక పుస్తకం నాకిచ్చి "ఈ పుస్తకం చాలా బాగుంది. చదవండి. మీకు నచ్చుతుంది" అని అన్నారు.
పుస్తకం పేరు "అంటు ది లాస్ట్ ". రస్కిన్ రాసిన పుస్తకమది.
ఆ పుస్తకం చదవడం ప్రారంభించాను.చివరివరకు దాన్ని వదల లేకపోయాను. నన్ను ఆ పుస్తకం కట్టి వేసింది. జోహన్స్ బర్గ్ నుండి నేటాలుకు 24 గంటల ప్రయాణం.
సాయంత్రం రైలు డర్బను చేరుకుంది.
ఇంటికి చేరిన తరువాత ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. పుస్తకంలో చదివిన విషయాన్ని ఆచరణ లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను.
ఇంతకు ముందు రస్మిన్ పుస్తకాలు ఏవీ నేను చదవలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో పాఠ్య
పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు నేను అసలు చదవలేదనే చెప్పవచ్చు. మన దేశంలోకి అడుగు పెట్టిన తరువాత సమయం చిక్కలేదు. అందువల్ల యీనాటి వరకు నాకు గల పుస్తక జ్ఞానం తక్కువేనని
చెప్పక తప్పుదు. అనుకోకుండా అప్పుడెప్పుడో దొరికిన కొంత సమయంవల్ల కొంత లాభమే జరిగింది. ఈ సమయాల్లో కొన్ని పుస్తకాలు చదివాను. చదివిన కొద్ది పుస్తకాలను ఒంటపట్టించుకున్నానని మాత్రం చెప్పగలను.
నా జీవితంలో చదివిన తక్షణం మహత్తరమైన నిర్మాణాత్మకమైన మార్పు తెచ్చిన పుస్తకం ఇదేనని చెప్పగలను. తరువాత దాన్ని "సర్వోదయం" అను పేరుతో రస్కిన్ వ్రాసిన 'అంటు ది లాస్ట్' ను అనువదించాను.
నాలో లోతుగా పాతుకు పోయిన విషయాల ప్రతిబింబం స్పష్టంగా రస్కిన్ రచించిన ఈ పుస్తకంలో నాకు కనబడింది. అందువల్ల యీ పుస్తక ప్రభావం నా హృదయం మీద అపరిమితంగా పడింది. పుస్తకంలోని విషయాల్ని ఆచరణలో పెట్టాలని ప్రేరణ కలిగింది. మనలో నిద్రావస్థలో వున్న మంచి భావాలను, గుణాలను మేల్కొనగల శక్తి కలవాడే కవి. కవుల ప్రభావం అందరిమీదా పడదు.
సర్వులలో మంచి భావాలు సమాన పరిమాణంలో వుండకపోవడమే అందుకు కారణం.
నేను తెలుసుకున్న సర్వోదయ సిద్ధాంతాలు యివి:
1. సర్వుల మంచిలోనే తన మంచి ఇమిడి ఉంది.
2 వకీలు, క్షురకుడు ఇద్దరి వృత్తికి విలువ ఒకటి గానే వుండాలి. జీవనోపాధి హక్కు అందరికీ సమానమే.
3. నిరాడంబరంగా వుంటూ కష్టపడి పనిచేసే రైతు జీవనమే నిజమైన జీవనం.
మొదటి విషయం నాకు తెలుసు.
రెండో విషయం కొంచెం తెలుసుకుంటున్నాను.
మూడో విషయాన్ని నేను ఎన్నడూ ఊహించలేదు.
మొదటిదానిలో మిగతా రెండూ యిమిడి వున్నాయి. విషయం దీపంవలె వెలుగు ప్రసారం చేసి సర్యోదయాన్ని నాకు బోధ చేసింది.
తెల్లవారింది.
ఇక ఆచరణకుపూనుకున్నాను.
____ గాంధీ

Comments
Post a Comment