Skip to main content

82వ రోజు


మన ఆలోచనల ప్రతిబింబమే మన వ్యక్తిత్వం
                                  
               జేమ్స్ అలెన్ రాసిన "యాజ్ ఎ మ్యాన్ థింకెథ్" పుస్తకాన్ని డా: మృణాళిని "మనిషంటే అతని ఆలోచనలే"
అని తెలుగులో మంచి భాషా పదబంధాలతో అనువదించారు.
ప్రతి వ్యక్తికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మనస్సులో ఉదయించిన ఆలోచనలు మెల్లగా కార్యరూపం దాలుస్తాయి. దీన్నే భావం బౌతికరూపం దాల్చటం అంటాం. మనం చేసే పనులు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మనం ఏం మాట్లాడుతామో అది మన వ్యక్తిత్వాన్ని తెలియజేయవు. మనం చేసే కార్యాచరణే గీటురాయి. మనం చేసే పనులు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అందుకనే మన ఆలోచనా విధానం మన జీవితాన్ని విర్దేశిస్తుంది. మన భవిష్యత్తుకు ఎవరు బాధ్యులు? మనమే. కానీ చాలా మంది అదృష్టమని లేదాదురదృష్టమని లేదా మరొకరి నయవంచన అని కొంతమంది చెపుతుంటారు. ఇది పూర్తిగా తప్పని చెప్పుతారు. జేమ్స్ అలెన్.
          మనం ఏంకావాలని కోరుకుంటామో అదే అవుతాము. మన సంకల్పమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనిషి ఆలోచనలకు యజమాని తానే. ఆలోచనలు పరంపరంగా ఉద్భవిస్తాయి. వాటికి హద్దు ఉండదు. వాటిపై అదుపు సాధించుకోవాలి. దీనినే బుద్ధుడు ఎరుకతో ఉండాలన్నాడు. చైతన్యవంతమైన వ్యక్తి తన ఆలోచనల పై అదుపు సాధించి వాటిని నిర్మాణాత్మకంగా ఉపయోగిస్తాడు. మనిషి
తన ఆలోచనల క్రమాన్ని సక్రమంగా గుర్తించినవాడు చైతన్యవంతంగా ఉంటాడు. మనిషి అంతరంతరాల్లోని లోతు ను త్రవ్వి తీస్తే తనగురించి అర్థమవుతుంది. తన వ్యక్తిత్వ నిర్మాణమంతా తనవల్లనే వీలవుతుందని గుర్తించగలడు.
మనిషి జ్ఞానం పొందాలంటే ఎంతో సహనం ఉండాలి. అభ్యాసం అవసరం ఎంతో ఉంది. నిరంతర అవకాశాలను అంది పుచ్చుకోవాలి.
            ఆచరణ ద్వారా జ్ఞానం ఎంతో వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా అలోచించగలిగే శక్తి వస్తుంది. తన ఆలోచనల ప్రభావం తనమీద ఇతరుల మీద ఎంత ఉందో పరిశీలించుకోవాలి.
ఒక వ్యక్తి జీవితంలోని అంతర బాహిర పరిస్థితులు సామరస్యంగా ఉంటే అతని మనస్సు చక్కగా ఆలోచిస్తుంది. పైగా మానసిక స్వస్థత చేకూరుతుంది. మానసిక స్వస్థత కావాలంటే ఆవ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా మరియు సుభిక్షంగా ఉండాలి. 
               వ్యక్తి ఆలోచనా విధానమే అతని వ్యక్తిత్వం. సుబ్బారావుకు విపరీతమైన తాగడం అలవాటుంది. అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడు తండ్రి తాగుడు
అలవాట్లు గమనించి ఆయనను అనుకరిస్తూ తాగుబోతుగా మారాడు. మరొకడు తండ్రి తాగుడు వల్ల అతని పతనాన్ని అనారోగ్యాన్ని గమనించి బుద్ధిగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇది ఎలా జరిగింది? దీనికి కారణం వారివారి ఆలోచనా విధానమే.
             రెండు వేరువేరు కంపేనీలు ఒక ఊరికి చెప్పుల దుకాణం ఏర్పాటు చేయడం కోసం తమ ప్రతినిధులను పంపించారు. ఆ ఊరిలో ఎవరూ చెప్పులు వేసుకోవడం లేదు. దీనిని ఆ ప్రతినిధులు గమనించారు. ఒక వ్యక్తి ఏమో ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోవడం లేదు కాబట్టి మన వ్యాపారం ఇక్కడ ఏమాత్రం జరగదని తన కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినాడు. మరొక వ్యక్తి ఇక్కడ ఎవరూ చెప్పులు వేసుకోవడం లేదు.కాబట్టి మన దుకాణాన్ని ప్రారంభించి చెప్పులు వేసుకోవటం ప్రజలకు అలవాటు చేస్తే బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతుందని చెప్పినాడు.ఇలా వేరువేరు అభిప్రాయాలను వారెందుకు చెప్పినారు? వారి ఆలోచనా విధానమే ఇందుకు కారణం. జరగదు అన్న వ్యక్తిది వ్యతిరేక ఆలోచనా ధోరణి. జరుగుతుంది అన్న వ్యక్తిది సానుకూల ఆలోచనా ధోరణి.
            వ్యక్తికి ఉన్న బలహీనతల కారణంగా వ్యతిరేక దృక్పథం ఏర్పడుతూ ఉంటుంది. దాంతో తన చేతకాని తనానికి ఇతరులు కారణమని భావిస్తారు. నిజానికి స్వీయ నియంత్రణ అలవాటు చేసుకొని స్వీయ ప్రక్షాలనకు నడుం బిగించాలి.
           కొంతమంది బాబాలను కొలుస్తుంటారు. మరి కొంతమంది పూజలు పునస్కారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ వుంటారు. వాస్తవానికి వ్యక్తి ఆలోచనలు, ఆచరణ ఒకేరకంగా ఉంటే ఆవ్యక్తి కోరుకున్నది వాస్తవరూపం దాల్చుతాయి. మనిషి అంతరంతరాలలో నుంచి వచ్చిన భావాలు అతని భవిష్యత్తును నిర్ణయాత్మకం చేస్తాయి. తమ చుట్టూ ఉన్న ప్రపంచం మారలేదని భావిస్తూ వుంటారు. ముందు తాము మారాలని అనుకోరు. నిజానికి మనిషికి మార్పంటే భయం. మార్పు చెందడానికి వ్యతిరేకం. మనిషి సహజంగానే బద్దకంగానే ఉంటాడు. బద్దకాన్నివదిలించుకొంటే మార్పుకు సిద్ధమవుతాడు. అప్పుడు తాననుకున్నది సాధించగలడు.    
            జొన్న విత్తనం నుంచి జొన్న చెట్టే వస్తుంది. మరొకటి
కాదు. అలాగే మంచి ఆలోచనల నుంచి మంచి చర్యల నుంచి మంచి ఫలితాలేవస్తాయి. చెడు ఫలితాలు రావు. చెడు ఆలోచనల నుంచి చెడు చర్యల నుంచి మంచి ఫలితాలు ఏనాడూరావు.
           ప్రకృతి కొన్ని నియమాలతో నడుస్తోంది. ప్రకృతిలో ఆకర్షణ-వికర్షణ అనే నియమం ఉంది. సౌరకుటుంబం ఆక్షణ-వికర్షణ ద్వారానే నిలిచివుంది. భూమికి గురుత్వార్షణ బలం వుంది. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఇలా చాలా నియమాలు ప్రకృతిలో వున్నాయి. ఇలాగే చెడు ఆలోచనలు మద్యపాన వ్యసనంగా, లైంగిక వాంఛలుగా పరిణమిస్తాయి. ఇలాంటి అవకతపు ఆలోచనలు
మనల్ని అయోమయంలోకి, కలవర పెట్టే సరిస్థితుల్లోకి పెట్టేస్తాయి. ప్రకృతి సూత్రాలు మన ఆలోచనలకు కూడా వర్తిస్తాయి. ఆలోచన వుండటం వేరు దాన్ని అమలు చేయటం అన్నది వేరు. అమలుకు సిద్ధంగా ఉన్న ఆలోచన చాలా శక్తివంతమైనది,
           మనం ఎవరితో తిరుగుతామో వారి ఆలోచనల ప్రభావం మనపై వుంటుంది. సావాస దోషం అంటే ఇదే. 'నీమిత్రుడెవరో చెప్పు నీవెలాంటివాడవో చెపుతాను" అన్న సామెత దీని నుంచే పుట్టింది.
           మన ఆహార నియమాలు మార్చుకుంటే ఆలోచనలు మారిపోవు. మన ఆలోచనా విధానం మార్చుకోవాలి. మానసికంగా మంచి ఆలోచనలు చేస్తూవుంటే శరీరం కూడా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా వుంటారని చెబుతారు రచయిత.
           భావం భౌతిక శక్తిగా మారడం సాధ్యమని రచయిత సోదాహరణంగా వివరిస్తాడు. మన ఆలోచన ధైర్యంగా వుంటే అదొక గొప్ప చైతన్య శక్తిగా మారుతుంది. అందువల్ల సందేహాలు, భయాలు సంకోచాలు వదలి ఒక లక్ష్యం కోసం ఆలోచనలను కేంద్రీకరించి పనిచేస్తే,సాధించలేనిది ఏదిలేదు. విజయం సాధించిన వాళ్ళంతా ఇవే చెపుతుంటారు. పెద్ద విజయాలను సాధించటానికి ఎక్కువ త్యాగాలు
చేయాలంటాడు రచయిత. చిన్న వాటికి తక్కువ త్యాగాలు సరేసరి.
            ఉన్నత ఆదర్శాలు, ఉన్నత లక్ష్యాలు వున్న వ్యక్తి ఎప్పటికైనా వాటిని సాకారం చేసుకుంటాడు. అవరోధాలు సహజం. అయితే వాటిని ఎదుర్కొనడమేగాక ఆవరోధాలను అవకాశంగా భావించి వాటిని చాటుకుంటారు. అవరోధాలు ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహ చెందరాదు. అవరోధం విజయానికి సోపానమని అర్థం చేసుకోవాలి. దీనిని అర్థం చేసుకోని వాళ్ళు "దురదృష్టం" అంటారు. లేదంటే
'అదృష్టం' అంటారు. పూర్వజన్మ సుకృతం అంటారు.
          మన ఆదర్శాల స్వప్నాలే మన ఫలితాల్ని నిర్మిస్తాయన్నది మరచి పోరాదవి జేమ్స్అలెన్ తన పుస్తకంలో వివరిస్తాడు.
          పుస్తకం చదువుతున్నంత సేపూ ఆలోచన, ఆదర్శాలు, ఆచరణ మనిషికెంత అవసరమో దీనికి మన ఆలోచవా దృక్పథం మనల్ని నడిపిస్తోందని రచయిత మనల్ని సరైన దృక్కోడానికి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాడు. ఈ పుస్తకం మన జీవిత గమ్యాన్ని పరిగ్గా మలిచేందుకు బాగా వుపయోగ పడుతుంది.

పిళ్ళా కుమారస్వామి
                                  సెల్: 9490122229

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.