ఇక వాడు మారడు. "పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోగాని పోదు" అని కొందరి విషయంలో అంటుంటాం. ఎంత వయసొచ్చినా తమ మూర్ఖపు విధానాలను ఏమాత్రం మార్చుకోని వారిని గురించి పైవిధంగా వ్యాఖానిస్తాం.
60-70 ఏళ్ళచ్చినా కొందరిలో అసహనం, తొందరపాటు, కోపం, మొండి పట్టుదల మొదలగు అవలక్షణాలను చూస్తాం. అదే మరి కొందరి విషయంలో చిన్నవయసులోనే సమస్యలను ఎదుర్కొనడంలో నేర్పు, ఓర్పు సమసంయమనం మొదలైన సద్గుణాలు కనిపిస్తాయి. వయసెక్కు వున్నా కొందరిలో అనుభవరాహిత్యం, చిన్నవయసులోనే కొందరికి మంచి అనుభవం ఎందుకు కలుగుతాయి? అనుభవం లేని వారంతా స్వతహాగా మందబుద్ధులని, అనుభవజ్ఞులంతా స్వభావ రీత్యానే మేధావులని చెప్పలేం.
నిత్యజీవితంలో అనుభవ శూన్యులని మనం ఎవరినైతే అంటామో వారు తమ వృత్తిని సమర్థవంతంగానిర్వహిస్తుంటారు. బయటి ప్రపంచంతో వారికి సంబంధం వుండదు. వృత్తి స్థానం, ఇల్లు తప్ప ఇతర విషయాలను వారు పట్టించుకోరు.
అలాంటప్పుడు వారికి అనుభవం ఎలా పెరుగుతుంది?మరి అనుభవాన్ని ఎలా పొందుతారు?
1. స్వానుభవం: . ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, మారని వ్యక్తులు కొందరైతే, కొంతమంది, ఒక్కొక్క తాకిడి తగిలినప్పుడు కొంతకొంత అనుభవాన్ని పొందుతూ వుంటారు.
స్వయంగా సమస్యలను ఎదుర్కొనడం, పరిష్కారంలో ఒకటి, రెండుసార్లు వైఫల్యం చెందడం.ఆ గుణపాఠాల ఆధారంగా భవిష్యత్తులో కొంత నేర్పుతో, ఓర్పుతో సమస్యలను పరిష్కరించుకొనడం జరుగుతుంది. ఏ సమస్యనైనా స్వయంగా ఎదుర్కొంటే తప్ప అసలు దాన్ని గురించి ఆలోచించరు. ఇలా కేవలం తన జీవితం ద్వారానే అనుభవాన్ని పొందటమనేది నిదానమైన పక్రియ. దీనికి మూలం ఆత్మవిమర్శ. గతంలో ఫలానా సమస్య ఎదురైనప్పుడు దాన్ని సమర్ధవంతంగా పరిష్కరించుకొనలేక పోవడానికి కారణమేమిటి? అని ఆలోచించుకుంటేనే భవిష్యత్ లో మెరుగైన పరిష్కారం లభిస్తుంది. కనుక ఎవరైతే ఆత్మవిమర్శ చేసుకోరో వాళ్ళు అనుభవశూన్యులు గానే మిగిలిపోతారు.
2. విస్తృతమైన మానవ సంబంధాలు: మనకు ఎంత మంది వ్యక్తులతో పరిచయాలుంటే అంత ఎక్కువగా మన అనుభవం పెరుగుతుంది. పరిచయాలంటే పై పై పరిచయాలు
కాకుండా వాళ్ళ జీవన పరిస్తితులేంటి? వాళ్ళెదుర్కొంటున్న సమస్యలేంటి? వాటిని వారెలా పరిష్కరించుకుంటున్నారు? పరిష్కరించుకొనడంలో వారు వైఫల్యం చెందితే, అందుకు కారణాలేమిటి? సఫలం చెందితే అందులో యిమిడి వున్న నేర్పు,చాకచక్యాలేమిటి? ఇలా పరిశీలనాత్మకంగా మనదృష్టిని సారిస్తే, వారి అనుభవాలను కూడా మనం సొంతం చేసుకో వచ్చు.కేవలం పరిశీలించడం కాకుండా వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ మనకు చేతనైన సహకారాన్ని అందజేస్తే సమస్య వారిదైనా, దాని పరిష్కారంలో మనకు ప్రత్యక్షానుభవం
ఏర్పడుతుంది. సాధకబాధకాలు అవగతమవుతాయి. అలాంటి సమస్యలే మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు చాలామటుకు సౌలభ్యం ఏర్పడుతుంది.
మన ఇరుగు పొరుగు వారికి గాని,బంధువులు, స్నేహితులకుగాని వచ్చిన కష్టసుఖాలలో మన భాగస్వామ్యం అవసరమైనప్పుడు "వాళ్ళు మనకు ఇదివరలో ఏం సహాయం చేశారు. ఇప్పుడు మనమీ సహాయం చేస్తే,భవిష్యత్ లో వాళ్లు మనకు సహకరిస్తారా?" అనే ప్రశ్నలకు తావీయకుండా ఏమాత్రం మన భౌతిక పరిస్థితులు అనుకూలించినా సహకరించడం అవసరం. అందువల్ల ఒక మంచి పని చేశామనే తృప్తితో పాటు, ఆయా కార్యక్రమాలు నిర్వహించడంలో మనకు ప్రత్యక్షానుభవం మిగులుతుంది. ఈ రెండూ వాళ్ళు మనకిచ్చినట్లే కదా! ఏదో అనుభవాన్ని సంపాదించడం కోసం, ఎవరింట్లోనో రెక్కలు ముక్కలు చేసుకొని పని చేయడమేమిటి? అనే ప్రశ్న ఎదురుకావచ్చు.కానీ ఎవరికీ ఉపయోగపడకుండా అనుభవశూన్యంగా మృతప్రాయమైన జీవితం గడపడం సమంజసమా?
3. పుస్తకపఠనం: ప్రముఖ రచయితల నవలలు, కథలు మొదలైన సాహిత్యాన్ని చదవడం వల్ల కూడా అనుభవం పొందొచ్చు. గోర్కీ, టాల్‌స్టాయ్, బాల్జాక్, కొడవటిగంటి, శ్రీపాద, బీనాదేవి, చాసో, ప్రేమ్ చంద్, కిషన్ చందర్, శరత్ వంటి ఎందరో రచయితలు మానవ సమాజాన్ని,స్వభావాన్ని విశ్లేషించి అమూల్యమైన రచన లందించారు. వాటిని చదివితే ప్రపంచ ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. అయితే నేటి వ్యాపారమయ సమాజపు విష ప్రభావానికి లోనైన నేటి సాహిత్యంలో మంచి పుస్తకాలను ఎంపిక చేసుకోవడం మాత్రం అంత సులభమైన పనేం కాదు. మన ఎంపికను బట్టే ఫలిత ముంటుందనే వాస్తవాన్ని మరువరాదు.
పై మూడు ప్రక్రియల్లో విస్తృత పరిధిలో మానవ సంబంధాలను కలిగివుండడం విలువైనది, ఉపయుక్తమైనది, వేగవంతమైనది. అందువల్లనే వయసు తక్కువైనా కొంతమంది, ఎక్కువ అనుభవజ్ఞులుగా రూపొందడం జరుగుతుంది. కనుక పదిమందితో కలిసి మెలిసి బతకడంలో స్వార్థం,పరార్థం కూడా ఇమిడి వున్న విషయం గమనించాలి.
(కె.శ్రీనివాసులు__నిత్యజీవితం)

Comments
Post a Comment