Skip to main content

66 వ రోజు



చీకటిని తిట్టే బదులు దీపం వెలిగించు మొదలు
       pc physics.stackexchange.com
         “ చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ కూచోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపమైనా వెలిగించడం మంచిది " హైదరాబాద్ లోని సాహిత్య సంస్థ “ యువభారతి " ఈ వాక్యాలను ' మోటో'గా ప్రకటించించేది . చీకటి , వెలుతురు అనే పరిమితార్థంలోనే గాకుండా ఈ  వాక్యంలో చాలా లోతు వుంది . 
        చాలా మంది తమ ఇల్లు , వీధి , కార్యాలయం పట్ల విపరీతమైన విసుగును , అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు . అక్కడ ఎవరూ మంచివారు లేరని , ఏమీ చేయలేమని చెప్పబోతారు . మనం ఏదైనా సలహా ఇవ్వబోతే మీకు తెలియ దంటారు . ' మా వూరి సంగతి మీకు తెలియదు ' మా బాస్ సంగతి మీకు తెలియదు ' ఇలా అంటుంటారు . ఆ మాట నిజమే . వారి పరిస్థితులు మనకు తెలియకపోవడమూ సహజమే . అయితే వాటి గురించి అంత తెలిసిన వారు 
కూడా ఎందుకు అంత ' ఇదయి ' పోతున్నారో మాత్రం మనకు అర్థం కాదు . ఎప్పుడన్నా తీరిగ్గా వుండి 'ఏంటి మీ ఆఫీసు సంగతులు' అంటే పెద్ద భారతం విప్పుతారు . తీరా వారు చెప్పేవన్నీ సాదా సీదా సమస్యలు , సాధారణంగా వినిపించే ఆరోపణలే అయివుంటాయి . బయట సంబంధాలు లేకపోవడం వల్ల తమ సమస్యలే చాలా పెద్దవని అనుకుంటూ నిస్పృహను పెంచుకోవడం వల్ల క్రమంగా అసంతృప్తి అనే ఒక ఊబిలో 
కూరుకుపోవడంజరుగుతుంది . 
         నిజం చెప్పాలంటే ఇంటా బయటా ఏవో సమస్యలు , అవరోధాలు వుంటూనే 
వుంటాయి . అన్నీ ఏ ఒక్కరి చేతుల్లోనూ వుండవు. పరిస్థితులు కూడా ఒకరి అదుపాజ్ఞలను బట్టిరావు. తాము వుండే చోట గల వాస్తవ పరిస్థితిని గమనించి తదనుగుణంగా వ్యవహరించ గలిగినప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు . పరిస్థితులు బాగాలేవని 
తిట్టుకుంటూ కూర్చుంటే చివరకు నిష్క్రియా ప్రియులుగా , అసంతృప్త జీవులుగా మిగిలిపోతారు . 
తారు రోడ్డు మీద కారు తోలడంలో పెద్ద సమస్య వుండదు . గతుకుల రోడ్డు పైన బండి నడపడానికే పట్టుదల కావాలి . డ్రైవర్ ఎంత బాధపడినా రోడ్డు ఒక్కసారిగా మారిపోదు . అలాగే 
చుట్టూ వున్న పరిస్థితులు కూడా ఒక్కసారే తలకిందులైపోవు . ఎక్కడైనా నిబంధనలు , పని 
పద్ధతులు దీర్ఘకాలంలో రూపొందుతాయి . కనుక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా తట్టుకుని 
నిలబడి నెమ్మదిగా కృషి ప్రారంభించి , ముందుకు సాగడంలోనే మనిషి ప్రజాపాటవాలు బహిర్గత మవుతాయి . దానివల్ల క్రమంగా పరిస్థితులూ మార్చవచ్చు . మనుషులూ మారవచ్చు . జీవిత భాగస్వాములు లేదా కుటుంబసభ్యులు లేదా వృత్తి సహచరుల నుండి మొదట సహాయ నిరాకరణ , ప్రతికూలత కూడా వ్యక్తం కావచ్చు . అయినా మంచి ఉద్దేశంతో ఒక క్రమ పద్ధతిలో 
పనిచేస్తే ఆలస్యంగానైనా తప్పక ఫలితం కనిపిస్తుంది . వారు కూడా ఆలోచించడానికి వీలు కలుగుతుంది . పరిస్థితుల వల్లనే వారు అలా తయారై వుండొచ్చు . మన కృషి ఇప్పుడు వారికి కూడా ఉత్సాహం కలిగించవచ్చు . ఒకవేళ వారు మారకపోయినా అనుకున్న మార్గంలో 
ముందుకు పోతూనే వుండాలి . ఎవరో మారలేదని మంచి అనుకున్నది చేయకుండా వుండనవసరం లేదు . అలాంటి నిష్క్రియాప్రియత్వం వ్యక్తిగతంగా మీకు కూడా చాలా చెరుపు చేస్తుందని అర్థం 
చేసుకోవాలి . నిత్య కృషీవలులుగా వుండే వారికి నిరుత్సాహం దరిచేరదు . ఈ సమాజంలోని 
అసమానతలు , వివక్షతల దృష్ట్యా కొందరు యజమానులు , పై అధికారులు లేదా స్త్రీల 
విషయంలో భర్తలు కావాలని కఠినంగా , నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించవచ్చు . అప్పుడైనా అన్యాయాన్ని ఎదిరిస్తూనే చేయవలసింది మాత్రం బాధ్యతగా , చక్కగా నిర్వర్తించాలి . దానివల్ల కుటుంబంలో లేదా సంస్థలో సత్ఫలితాలు సాధించడంతో పాటు సాటి వారిలో సదభిప్రాయాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. అది సమిష్టి చైతన్యం పెరగడానికి , సమైక్య భావనకు దారితీస్తుంది . 
        ఎవరికి వారు చేయగలిగింది లేదని చేతులు ముడుచుకుంటే అందరికీ నష్టం కలుగుతుంది . అందుకు బదులు ఏ ఒక్కరు లేదా ఏ కొందరు చొరవ తీసుకున్నా ఇతరుల్లో కూడా 
నెమ్మదిగానైనా కదలిక వస్తుంది . 
          మనిషి సమాజాన్ని మారుస్తాడని చెప్పిన మార్క్స్ కూడా అతను ఉన్న పరిస్థితులలో 
ఆ పనిచేయాలని చెప్పాడు . జంతువులకు , మనిషికి తేడా ఏమంటే అవి వాతావరణాన్ని బట్టి పరిణామం చెందడం లేదా నశించడం జరుగుతుంది . మేధాశక్తి సంపన్నుడైన మనిషి అలాగాక పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు . ప్రకృతిని ఒక్కసారిగా మార్చలేక పోయినా అనేక రూపాల్లో క్రమక్రమంగా దాని పై అదుపు సాధించేందుకు సాగిపోతున్నాడు . అలాగే సామాజిక వ్యవస్థలను కూడా మారుస్తున్నాడు . ఈ విజయాలన్నింటికీ ప్రాతిపదిక మనుషుల ఆలోచన , సమిష్టి ఆచరణలే ! చేయవలసింది చేయకుండా ఎంతగా మదనపడినా మిగిలేది మనోవేదన తప్ప మానవాభ్యుదయం కాదు . చాలామంది మదనపడే విషయాలన్నీ  అంత తీవ్రమైనవి కావు. అందుకే చుట్టూ వున్న  మనుషులను ,  వాస్తవ పరిస్థితులను . అర్థం చేసుకుని ముందుకేయడానికి ప్రయత్నించడం శ్రేయస్కరం.

(తెలకపల్లి రవి_ నిత్యజీవితం)

Comments

Popular posts from this blog

98 వ రోజు

      pc: YouTube ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది కాబట్టి తలరాతను సృష్టించుకునేది మరెవరో కాదు మనమే.

99వ రోజు

          pc: fb Your mind is a magnet. If you think blessings you attract blessings and if you think problems you attract  problems. Always cultivate good thoughts and always remain positive and optimistic.

94 వ రోజు

      pc: pinterest  ఒక లక్ష్యం ఉన్న వారికి 1. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏలక్ష్యం లేని వాళ్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. 2.చేతినిండా పని, మనసు నిండా ఆలోచనలు ఉంటాయి. 3.సంతృప్తి ఉంటుంది 4.బద్ధకం దూరమవుతుంది 5.గెలవగలం, సాధించుకోగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ప్రయత్నంలో లోపం లేకుండా ప్రతి క్షణం గమ్యం ప్రేమిస్తారు. 6.కృషి, పట్టుదల పెరుగుతుంది 7.పదిమంది సహాయం లభిస్తుంది 8.ప్రకృతిలోని అన్ని శక్తులు కలిసి నీ లక్ష్య సాధనకు సహకరిస్తాయి.