ఒక బుల్లి పిట్ట పిచ్చుక సముద్రపు ఒడ్డున ఉన్న చెట్టు పై రెండు గుడ్లు పెట్టింది. ఆ రెంటిని చూసుకుని మురిసిపోయేది. ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయా అని ఎదురు చూస్తోంది.
ఒకసారి ఆహారం కోసం వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను సముద్రుని అలలే లాక్కు పోయాయని అర్థమైంది పిచ్చుకు.
వాటిని ఎలాగైనా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక. "ఓ సముద్రుడా! నా గుడ్లను ఒడ్డుకు చేర్చు" అంటూ సముద్రుని బతిమాలింది పిచ్చుక.
సముద్రుడు నవ్వి ఊరుకున్నాడు.
పిచ్చుక కోపంగా “నా గుడ్లను తెచ్చివ్వకపోతే, నీ నీళ్లన్నీ తోడేస్తా" అంటూ భయపెట్టింది పిచ్చుక.
ఈసారి సముద్రుడు ఫకపకా నవ్వాడు.
వెంటనే పిచ్చుక కోపంతో తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది.
అది చూసి సముద్రునితో పాటు ఇతర జంతువులు కూడా పకపక నవ్వాయి. అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు.
ఈ విషయం ఆనోటా ఈ నోటా పడి పక్షులకు రాజైన గరుత్మంతుడికి తెలిసింది.
ఆ చిన్ని పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్య పడ్డాడు. తన వంతు సహాయం చేద్దామని పిచ్చుక వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు.
"పిల్లల కోసం సముద్రుడి తో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను. నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నా" అని చెప్పాడు గరుత్మంతుడు.
అతని మాటలకు సంతోషించింది పిచ్చుక, గరుత్మంతుడు భీకర స్వరంతో “సముద్రుడా! గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.మా పక్షుల బలమంతా దించి నిన్ను ఔపోసన పట్టేస్తాం.జాగ్రత్త"అంటూ హెచ్చరించాడు.
దీంతో సముద్రుడు భయపడ్డాడు.
"గరుత్మంతుడు విష్ణువుకు సేవకుడు. విష్ణవు కూడా గరుత్మంతునికి సాయంగా వస్తే తన గతేం గానూ?"మనసులో అనుకొని సముద్రుడు భయంతో దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చాడు.
పిచ్చుకతో " నిన్ను తక్కువ అంచనా వేశాను.నన్ను క్షమించు. నీ ధైర్యం అమోఘం. పట్టు దల చాలా గొప్పది."అన్నాడు సముద్రుడు.
తన గుడ్లను చూసి పిట్ట ఆనందంగా ఎగిరిపోయింది.
(Courtesy:Telugustories.in)
Comments
Post a Comment